కేసీఆర్ అపాయింట్‌మెంట్ దొరకడం లేదంటున్న జగ్గారెడ్డి..!

Thursday, September 3rd, 2020, 12:10:28 AM IST


తెలంగాణ సీఎం కేసీఆర్ అపాయింట్‌మెంట్ కోసం కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వేచి చూస్తుండడం ఇప్పుడు రాజకీయాలలో తీవ్ర ఆసక్తి రేపుతుంది. పీసీసీ అధ్యక్షుడి రేసులో తాను కూడా ఉన్నానని చెప్పిన జగ్గారెడ్డి ఉన్నట్టుండి సీఎం కేసీఆర్ అపాయింట్‌మెంట్ కోరడం పలు అనుమానాలకు కారణం అవుతుంది. అయితే మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మరణంతో వారం రోజుల పాటు సంతాప దినాలు ఉన్నందున జగ్గారెడ్డికి సీఎం కేసీఆర్ అపాయింట్‌మెంట్ వాయిదా పడినట్టు తెలుస్తుంది.

ఇదిలాఉంటే తాను సీఎం కేసీఆర్‌ను ఖచ్చితంగా కలుస్తానని, ఒకవేళ అపాయింట్‌‌మెంట్ ఇవ్వకపోతే ప్రగతిభవన్ ముందు తన కుమార్తె జయరెడ్డితో కలిసి ధర్నాకు దిగుతానని అంటున్నారు. అయితే గత కొద్ది రోజులుగా జగ్గారెడ్డి ఆర్థికమంత్రి హరీష్ రావుపై తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపిస్తున్నారు. సింగూరు జ‌లాల‌ను సంగా‌రెడ్డి ప్ర‌జ‌ల‌కు కాకుండా సిద్దిపేటకు తరలించుకుపోతున్నారని హరీశ్ రావుపై ఆగ్రహంతో ఉన్నారు జగ్గారెడ్డి. అయితే ఇదే విషయంపై సీఎం కేసీఆర్‌తో మాట్లాడేందుకు అపాయింట్‌మెంట్ కోరారని కొందరు అంటుంటే, మరికొందరేఓ తన రాజకీయ అవసరాల కోసమే సీఎంను కలవాలని జగ్గారెడ్డి అనుకుంటున్నారని ప్రచారం జరుగుతుంది. అయితే జగ్గారెడ్డి మాత్రం ప్రజల సమస్యలను వివరించడానికే తాను సీఎం అపాయింట్‌మెంట్ కోరినట్టు చెబుతున్నాడు.