ప్రధాని మోదీకి భారతరత్న ఇవ్వాలి.. కాంగ్రెస్ సీనియర్ నేత డిమాండ్..!

Thursday, December 24th, 2020, 12:00:05 AM IST

దేశంలో అనేకమంది నేతలకు భారతరత్న ఇవ్వాలన్న డిమాండ్లు వినిపిస్తున్న తరుణంలో భారత ప్రధాని నరేంద్ర మోదీకి కూడా భారతరత్న ఇవ్వాలని తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత శంకర్‌రావు అభిప్రాయపడ్డారు. చాలా రోజులుగా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్న శంకర్‌రావు ఉన్నట్టుండి సడన్‌గా మీడియా ముందుకు వచ్చి ఇలా ఆసక్తికర వ్యాఖ్యలు చేయడంతో ఆయన కాంగ్రెస్‌ పార్టీని వీడి మరో పార్టీలో చేరతారా అన్న ప్రశ్నలు వినబడుతున్నాయి.

అయితే కరోనా వైరస్, వైద్యం పట్ల తనకున్న ఆలోచనలు చెప్పాలని మాత్రమే తాను మీడియా ముందుకు వచ్చానని ఓ రాష్ట్రానికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా, దేశానికి ఆరున్నర సంవత్సరాలు ప్రధానిగా ఉన్న మోదీ ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చారని స్వచ్ఛ భారత్, జీఎస్‌టీ, త్రిఫుల్ తలాక్ వంటి నిర్ణయాలు ఎంతో గొప్పగా ఉన్నాయని అందుకే ప్రధాన మంత్రి మోదీకి భారతరత్న ఇవ్వాలని రాష్టపతిని కోరుతున్నానని అన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా భారత్ లో కరోనా తగ్గుముఖం పట్టిందని దీనిపై కూడా మోదీ సమర్ధమైన నిర్ణయాలు తీసుకున్నారని అన్నారు. తాను పార్టీ మారడం లేదని, బీజేపీలోకి వెళ్లబోనని అన్నారు.