దుబ్బాక ఫలితం తర్వాత టీపీసీసీ మార్పు.. మధుయాష్కి ఆసక్తికర వ్యాఖ్యలు..!

Friday, November 6th, 2020, 06:08:37 PM IST

తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త పీసీసీ రాబోతున్నారని గత కొద్ది నెలలుగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నా అది మాత్రం వాయిదా పడుతూనే ఉంది. అయితే ఇప్పటికే ఈ పదవి కోసం పార్టీలో చాలా మంది నేతలు పోటీపడుతున్నారు. ఇటీవల రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంఛార్జ్‌గా మాణికం ఠాగూర్‌ని నియమించిన కాంగ్రెస్ హైకమాండ్, టీపీసీసీ చీఫ్ మార్పు అంశంపై మాత్రం ఇంకా ఫోకస్ పెట్టినట్టు కనిపించడం లేదు. అయితే ఓ పక్క రాష్ట్రంలో బీజేపీ కూడా నెమ్మదిగా పుంజుకుంటుండడంతో త్వరగా పీసీసీ మార్పును చేపట్టడం మంచిదని పలువురు నేతలు అభిప్రాయపడుతున్నారు.

అయితే తాజాగా టీపీసీసీ చీఫ్ మార్పుపై నిజామాబాద్ మాజీ ఎంపీ, ఏఐసీసీ కార్యదర్శి మధుయాష్కీ గౌడ్ మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో నాయకత్వ మార్పు అవసరం ఉందని, దుబ్బాక ఫలితాల తర్వాత పీసీసీ మార్పుకు అవకాశం ఉండవచ్చని అన్నారు. టీపీసీసీ అధ్యక్ష పదవి విషయంలో రాష్ట్ర ఇంఛార్జ్ మాణిక్యం ఠాగూర్, ఏఐసీసీ కార్యదర్శి శ్రీనివాస కృష్ణన్ తమ రిపోర్టులు హైకమాండ్‌కు అందించబోతున్నారని దానిని బట్టి హైకమాండ్ పీసీసీనీ నియమించే అవకాశం ఉన్నట్టు తెలిపారు. దుబ్బాక ఫలితం ఎలా ఉన్నా కాంగ్రెస్ పార్టీ కొత్త ఉత్సాహాంతో ముందుకు వెళ్తుందని అన్నారు.