కొండా సురేఖ, ఎమ్మెల్యే సీతక్కలపై కాంగ్రెస్ హైకమాండ్ ఫోకస్..!

Sunday, December 27th, 2020, 09:49:54 AM IST

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఎవరికి కట్టబెట్టాలన్న దానిపై కాంగ్రెస్ అధినాయకత్వం ముమ్మర కసరత్తు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే పీసీసీగా రేవంత్ రెడ్డి పేరు దాదాపుగా ఖరారైందన్న ప్రచారం జరుగుతున్న నేపధ్యంలో పార్టీలో వీహెచ్ వంటి సీనియర్ల నుంచి తీవ్ర నిరసన వ్యక్తం అవుతుంది. రేవంత్ రెడ్డికి కనుక రాష్ట్ర కాంగ్రెస్ బాధ్యతలను అప్పచెబితే తాను కాంగ్రెస్ పార్టీలో ఉండనని, తనతో పాటు చాలా మంది నేతలు పార్టీనీ వీడిపోవడం ఖాయమని తేల్చి చెప్పారు.

అయితే ఇలాంటి సమయంలో పార్టీలోని పరిస్థితులను కంట్రోల్ చేసేందుకై మాజీ మంత్రి కొండా సురేఖ పేరు తెరపైకి వచ్చింది. మంత్రిగా చేసిన అనుభవం, రాష్ట్రంలో ఉన్న రెండు ప్రధాన బీసీ సామాజిక వర్గాలతోనూ ఆమెకు మంచి సంబంధాలు ఉండడంతో ఆమెకు వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలను అప్పచెప్పాలని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తుందని సమాచారం. అంతేకాదు ప్రత్యర్థులపై మాటల తూటాలు పేల్చే ఆమె బీజేపీలోకి వెళ్లిపోయిన డీకే అరుణ, విజయశాంతిలకు గట్టి పోటీగా అనుకుంటున్నారట. ఇక మరో ఎమ్మెల్యే సీతక్కకు కూడా రాష్ట్ర మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా బాధ్యతలు అప్పగించాలని హైకమాండ్ భావిస్తున్నట్లు కూడా తెలిసింది. గిరిజన సామాజిక వర్గానికి చెందిన చెందిన సీతక్కకు మంచి గుర్తింపు, పేరు ఉన్నాయి. అందుకే ప్రస్తుతం మహిళా కాంగ్రెస్‌ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న సీతక్కకు రాష్ట్ర మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా బాధ్యతలు ఇవ్వాలని హైకమాండ్ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది.