దుబ్బాక కాంగ్రెస్ అభ్యర్థి ఎంపికపై సస్పెన్స్.. టీఆర్ఎస్‌కి నష్టం తప్పదా?

Monday, October 5th, 2020, 01:14:50 PM IST

తెలంగాణలో త్వరలో జరగబోతున్న దుబ్బాక ఉప ఎన్నికను అన్ని ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇప్పటికే ఎవరికి వారు తమ అంచనాలను లెక్కేసుకుని పార్టీ టికెట్ ఎవరికి కట్టబెట్టాలన్న దానిపై అన్ని పార్టీలు తీవ్రంగా చర్చించుకుంటున్నాయి. అయితే బీజేపీ అభ్యర్థిగా ఆ పార్టీ కీలక నేత రఘునందన్ రావు పేరు ఇప్పటికే దాదాపు ఖరారైనట్టు తెలుస్తుంది. ఈ నేపధ్యంలో రఘునందన్ రావు నియోజకవర్గంలో తన ప్రచారాన్ని జోరుగా కొనసాగిస్తున్నారు.

అయితే కాంగ్రెస్‌ అభ్యర్థిగా సిద్దిపేట డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి పేరు కూడా దాదాపు ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది. నిన్న జరిగిన కాంగ్రెస్ ముఖ్యనేతల సమావేశంలో ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన మెజారిటీ నేతలు నర్సారెడ్డి అభ్యర్థిత్వానికే మొగ్గు చూపడంతో, ఆయన పేరునే ఫైనల్ చేయాలని పీసీసీ నిర్ణయించింది. అయితే దుబ్బాక ఎన్నికల్లో తన పేరు అభ్యర్థిగా ప్రకటిస్తే పార్టీలోకి వస్తానని చెరుకు శ్రీనివాస్‌రెడ్డి మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహతో మంతనాలు జరుపుతుండడంతో కాంగ్రెస్ మళ్ళీ పునరాలోచనలో పడినట్టు తెలుస్తుంది.

అయితే అధికార పార్టీ టీఆర్ఎస్ సిట్టింగ్ స్థానమైన ఇంకా అభ్యర్థి పేరును ప్రకటించలేదు. అయితే సోలిపేట రామలింగారెడ్డి భార్య సుజాతకు టికెట్‌ ఇచ్చేందుకు దాదాపు అదిష్టానం నిర్ణయం తీసుకుందని, అయితే అదే పార్టీకి చెందిన చెరుకు శ్రీనివాసరెడ్డి మాత్రం టికెట్ తనకే వస్తుందని తన అనుచరులతో ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఒకవేళ చెరుకు శ్రీనివాసరెడ్డికి కనుక టికెట్ దక్కకపోతే ఆయన కాంగ్రెస్‌లో చేరిపోతారా లేక ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తారా అనేది ఇప్పుడు హాట్ టాఫిక్‌గా మారింది. అయితే ఇదే జరిగితే అధికార పార్టీ టీఆర్ఎస్‌కు నష్టం జరిగే అవకాశం కనిపిస్తుంది.