తెలంగాణలో కూడా ఆయుష్మాన్ భారత్ అమలు.. సీఎం కేసీఆర్ మరో కీలక నిర్ణయం..!

Thursday, December 31st, 2020, 02:06:42 AM IST


తెలంగాణ సీఎం కేసీఆర్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆయుష్మాన్ భారత్‌ని‌ ఇకపై తెలంగాణలో కూడా అమలు చేయబోతున్నారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఆయుష్మాన్ భారత్ కంటే తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న ఆరోగ్య శ్రీ పథకం అద్భుతంగా ఉందని పలు సార్లు చెప్పిన సీఎం కేసీఆర్ ఇప్పుడు సడెన్‌గా ఆయుష్మాన్ భారత్‌కు మద్ధతు తెలిపారు.

అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్ భారత ప్రభుత్వ ఆయుష్మాన్ భారత్ పథకంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్యశ్రీ పథకాన్ని జోడించడానికి సీఎం కేసీఆర్ సుముఖత వ్యక్తం చేశారని ప్రధాని మోదీకి తెలియచేశారు. ఇదిలా ఉంటే కేంద్రం తెచ్చిన వ్యవసాయ సంస్కరణల చట్టాలకు వ్యతిరేకంగా కొద్ది రోజుల క్రితం రైతులు నిర్వహించిన భారత్ బంద్‌కు మద్ధతు తెలిపిన టీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున నిరసనలు తెలిపి, జాతీయ రహదారులను కూడా దిగ్బంధించింది. ఆ తర్వాత కొన్ని రోజులకే కేంద్రం చట్టాలకు తెలంగాణ ప్రభుత్వం జై కొట్టింది. ఇప్పుడు అదే సీన్ ఆయుష్మాన్ భారత్‌పై కూడా చోటు చేసుకోవడం మరో విశేషం.