వ్యవసాయ శాఖలో కొత్తగా రెండు ప్ర‌త్యేక విభాగాలు.. సీఎం కేసీఆర్ నిర్ణయం..!

Saturday, October 24th, 2020, 06:58:20 AM IST

వ్యవసాయ శాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం కేసీఆర్ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని వ‌్య‌వ‌సాయ‌శాఖ‌లో కొత్తగా రెండు ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేయాల‌ని నిర్ణయించారు. ఇందులో ఒక విభాగం మార్కెటింగ్ పై, మరో విభాగం సాగునీరు, విద్యుత్, ఎరువులు, విత్తనాలు ఇతర వ్యవసాయ మౌలిక సదుపాయాలపై దృష్టి సారించాలని అన్నారు. ఏ పంటకు ఎక్కువ డిమాండ్ ఉంది? ఏ పంటవేస్తే రైతులకు లాభం ఉంటుందన్న దానిపై మార్కెటింగ్ శాఖ, సివిల్ సప్లయీస్, వ్యాపారులతో సమన్వయం కుదుర్చుకొని మంచి ధర వచ్చేలా వ్యూహాలు రూపొందించాలని అన్నారు.

అయితే ఈ రెండు విభాగాలకు ఐఏఎస్ అధికారులు నేతృత్వం వహించాలని అన్నారు. అయితే రాష్ట్రంలోని రైతులు కొన్నిరకాల పంటలు వేయడానికి మాత్రమే అలవాటు పడ్డారని ఈ పద్ధతి మారితే వ్యవసాయ రంగం మరింత మెరుగుపడుతుందని సీఎం కేసీఆర్ భావించారు. మార్కెట్‌లో మంచి ధర వచ్చే పంటలు వేయాలని అన్నారు. నీటి లభ్యత, భూముల రకం, వాతావరణం, మార్కెటింగ్ అంశాలను దృష్టిలో పెట్టుకొని రైతులకు ఎప్పటికప్పుడు ఏ పంటలు వేయాలన్న విషయంపై అధికారులు దిశానిర్దేశం చేయాలని సూచించారు.