దసరాకి ముందే సాయం అందాలి.. సీఎం కేసీఆర్ ఆదేశం..!

Saturday, October 24th, 2020, 11:29:06 AM IST

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు హైదరాబాద్ నగరం అతలాకుతలమయ్యింది. నదులు, చెరువులు పొంగిపొర్లడంతో లోతట్టు ప్రాంతాలలోని చాల కాలనీలు నీట మునిగాయి. అయితే ఇప్పుడిప్పుడే వర్షాలు కాస్త గ్యాప్ ఇచ్చినా ఇంకా కొన్ని ప్రాంతాలలో వరద ప్రవాహం ఆగడం లేదు. అయితే వరదలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలకు యుద్ధ ప్రతిపాదికన సాయం అందించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు.

అయితే సీఎం కేసీఆర్ ప్రకటించిన మేరకు ప్రభుత్వం తరపున వరద ప్రభావానికి గురి అయిన ప్రతి ఇంటికి 10 వేల రూపాయలు, పూర్తిగా ఇళ్లు కూలిపోయిన వారికి లక్ష రూపాయలు, పాక్షికంగా ధ్వంసం అయిన ఇళ్ళకి 50 వేల రూపాయల చొప్పున ఆర్ధిక సహాయం అందిస్తున్నారు. అయితే ఈ పరిహారం ప్రజలకు దసరా పండుగకు ముందే అందించాలని, అలా అందిస్తేనే పేదలకు ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు. రోజుకు లక్ష మందికి సాయం అందించేలా చర్యలు చేపట్టాలని సీఎం కేసీఆర్ మరోసారి పేర్కొన్నారు.