ధరణి పోర్టల్‌లో మరిన్ని ఆప్షన్లు పెట్టి మెరుగుపరుస్తాం – సీఎం కేసీఆర్

Friday, January 1st, 2021, 02:24:27 AM IST


ధరణి పోర్టల్ నిర్వహణపై నేడు అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం కేసీఆర్ అధికారులకు కీలక సూచనలు చేశారు. ధరణి పోర్టల్‌లో సాగుభూముల అంశాల్లో నెలకొన్న సందిగ్దతలకు రెండు నెలల్లో పరిష్కారం చూపాలని కోరారు. ధరణి పోర్టల్ రావడంతో రైతులు ఆఫీసుల చుట్టూ తిరిగే అవసరం లేకుండా పోయిందని, ఎవరి దగ్గరా పైరవీ చేసుకోవాల్సిన దుస్థితి లేకుండా నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు జరుగుతున్నాయని అన్నారు.

ధరణి పోరటల్ వచ్చిన రెండు నెలల వ్యవధిలోనే లక్షా ఆరు వేల మంది ధరణి ద్వారా స్లాట్‌బుక్ చేసుకొని వారిలో 80వేల మంది రిజిస్ట్రేషన్ కూడా పూర్తి చేసుకున్నారని సీఎం కేసీఆర్ అన్నారు. రాష్ట్రంలో 90శాతం మంది రైతులు 5ఎకరాలలోపు భూములు ఉన్నవారే ఉన్నారని వారందరూ రిజిస్ట్రేషన్ల విషయంలో ఎలాంటి ఇబ్బందులు పడకూడదన్నదే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. అందుకే ధరణి పోర్టల్‌లో మరిన్ని ఆప్షన్లు పెట్టి మెరుగుపరచాలని అధికారులను ఆదేశించినట్టు సీఎం కేసీఆర్ చెప్పుకొచ్చారు.