గ్రేటర్ టీఆర్ఎస్ మేనిఫేస్టో.. వరాలు కురిపించిన సీఎం కేసీఆర్

Monday, November 23rd, 2020, 03:14:32 PM IST

గ్రేటర్ ఎన్నికలకు సంబంధించి అధికార టీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. తెలంగాణభవన్‌లో జరిగిన కార్యక్రమంలో సీఎం కేసీఆర్ తమ మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం కేసీఆర్ గ్రేటర్ ప్రజలకు మరియు కరోనా కారణంగా దెబ్బతిన్న పరిశ్రమలకు వరాలు కురిపించారు. నగరవాసులు డిసెంబర్‌ నుంచి నల్లా బిల్లులు చెల్లించాల్సిన అవసరంలేదని ప్రకటించారు. 20 వేల లీటర్ల వరకు ఉచితంగా నీటిని సరఫరా చేస్తామని, ప్రతి ఒక్కరు నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు. త్వరలోనే దీనిని మున్సిపాలిటీలకు కూడా వర్తింపచేస్తామని అన్నారు.

అంతేకాకుండా సెలూన్లు, లాండ్రీలు, దోబీఘాట్‌లకు డిసెంబర్‌ నుంచి ఉచిత విద్యుత్ ఇస్తున్నట్టు ప్రకటించారు. లాక్‌డౌన్‌ సమయంలో అనగా మార్చ్ నుంచి సెప్టెంబర్ వరకు మోటార్‌ వాహనాల పన్ను రద్దు చేస్తామని తెలిపారు. ఇక టీఎస్ బీపాస్‌ను మరింత పటిష్టం చేస్తామని తెలిపారు. త్వరలోనే జీహెచ్ఎంసీ కొత్త చట్టం తీసుకొస్తామని అన్నారు. ఇక కరోనా కారణంగా దెబ్బతిన్న సినిమా రంగాన్ని కూడా ఆదుకుంటామని సినీ కార్మికులకు రేషన్, హెల్త్ కార్డులు అందిస్తామని కేసీఅర్ ప్రకటించారు. ఇక రాష్ట్రంలో అన్ని ధియేటర్లకు విద్యుత్ కనీస డిమాండ్ ఛార్జీలు రద్దు చేస్తున్నామని, షోలు పెంచుకునేందుకు అనుమతి ఇస్తున్నామని తెలిపారు. మహారాష్ట్ర, కర్నాటక, ఢిల్లీ తరహాలో టికెట్ ధరలను కూడా పెంచుకునే వెసలుబాటు కలిపిస్తామని అన్నారు. 10కోట్ల లోపు బడ్జెట్‌తో తీసే సినిమాలకు జీఎస్టీ రీయింబర్స్‌మెంట్ ఇవ్వనున్నట్టు తెలిపారు.