గ్రేటర్ ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించిన టీఆర్ఎస్.. ఏమేమున్నాయంటే?

Wednesday, November 18th, 2020, 05:54:27 PM IST

గ్రేటర్ ఎన్నికల నగారా మోగడంతో అన్ని ప్రధాన పార్టీలు అభ్యర్థుల జాబితాను, మేనిఫెస్టోను రూపొందించే పనిలో నిమగ్నమయ్యాయి. అయితే అధికార పార్టీ టీఆర్ఎస్ పార్టీ అందరికంటే ముందుగానే గ్రేటర్ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. నేడు సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన టీఆర్ఎస్ ఎల్పీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా గ్రేటర్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై నేతలకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. బీజేపీ నేతల అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలని, గ్రేటర్‌లో మన ప్రభుత్వం చేసిన అభివృద్ధితో పాటు, కరోనా, వరదల్లో వ్యవహరించిన తీరును ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.

అనంతరం తమ పార్టీ మేనిఫెస్టోను సీఎం కేసీఆర్ రిలీజ్ చేశారు. అయితే మేనిఫెస్టోలోని ప్రధానాంశాలను చూసుకున్నట్టైతే రూ.1900 కోట్లతో మరో 280 కీ.మీ. మేర మిషన్ భగీరథ పైప్‌లైన్ వేయించనున్నట్టు, నగరంలో కొత్తగా 4 ఆడిటోరియాల నిర్మాణం, జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని గ్రంథాలయాల ఆధునీకరణ, ఆధునిక స్టేడియాలు, క్రీడా వసతుల ఏర్పాటు, రూ.130 కోట్లతో 200 ఆదర్శ సమీకృత మార్కెట్ల ఏర్పాటు, నగరమంతా ఉచిత వైఫై సదుపాయం, మూసీ పునరుద్దరణ, సుందరీకరణ అలాగే హుస్సెన్‌సాగర్ శుద్ధికి ప్రణాళిక వంటి అంశాలు ఉన్నాయి.