టీఆర్ఎస్ వీరుల పార్టీ.. వీపు చూపించే పార్టీ కాదు – సీఎం కేసీఆర్

Wednesday, February 10th, 2021, 06:30:27 PM IST

నల్గొండ జిల్లా హాలియాలో టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో మాట్లాడిన సీఎం కేసీఆర్ కాంగ్రెస్, బీజేపీ పార్టీలపై నిప్పులు చెరిగారు. టీఆర్ఎస్ పార్టీ అంటే వీరుల పార్టీ అని, వెన్ను చూపించే పార్టీ కాదని అన్నారు. ఎవరో నామినేట్ చేస్తే వచ్చిన ప్రభుత్వం మాది కాదని, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం అని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీకి తెలంగాణ పేరు పలికే అర్హత కూడా లేదని పదవుల కోసం తెలంగాణ ప్రయోజనాలు తాకట్టుపెట్టారని, ఇప్పుడు పొలం బాట, పోరు బాట అని కాంగ్రెస్‌ నేతలు మాట్లాడుతున్నారని అన్నారు. బీజేపీ నాయకత్వం కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని తాము తలుచుకుంటే దుమ్ము దుమ్ము అవుతారని ఇక్కడ ఎవరూ చేతులు ముడుచుకుని కూర్చోలేదని హెచ్చరించారు.

ఈ సందర్భంగా నల్గొండ జిల్లాపై సీఎం కేసీఆర్ వరాల జల్లులు కురిపించారు. నల్గొండ జిల్లాలో మొత్తం 844 గ్రామ పంచాయతీలు ఉన్నాయని ప్రతీ గ్రామ పంచాయతీకి రూ.20 లక్షలు ఇస్తామని ప్రకటించారు. అంతేకాదు జిల్లాలో ప్రతి మండల కేంద్రానికి రూ.30 లక్షలు, నల్గొండ మున్సిపాలిటీకి రూ.10 కోట్లు, మిర్యాలగూడ మున్సిపాలిటీకి రూ.5 కోట్లు, మిగిలిన మున్సిపాలిటీలజు కోటి రూపాయల చొప్పున మంజూరు చేస్తామని అన్నారు. నెల్లికల్లు చుట్టుపక్కల గ్రామాల్లో భూవివాదాలను వెంటనే పరిష్కరించి పట్టాలు అందిస్తామని అన్నారు. త్తంగా నల్లగొండ అభివృద్ధికి రూ.186 కోట్లను సీఎం ప్రకటించారు. హాలియా సభలో మాట్లాడిన ఆయన.. నల్లగొండ ఆయకట్టుకు శాశ్వతంగా నీళ్లు అందిస్తామని, పెద్దదేవులపల్లికి నీళ్లు అందిస్తామని, కృష్ణ, గోదావరి అనుసంధానం చేసి రైతులు కాళ్లు కడుగుతామని కేసీఆర్ అన్నారు. ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేయకపోతే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగమని, ఛాలెంజ్ స్వీకరిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా త్వరలో అర్హులందరికీ కొత్తగా పింఛన్లు, రేషన్‌ కార్డులిస్తామని అన్నారు.