కేంద్ర మంత్రి హర్దిప్ సింగ్ పూరితో సీఎం కేసీఆర్ భేటీ.. ఏం చర్చించారంటే?

Saturday, December 12th, 2020, 08:00:33 PM IST

తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన రెండో రోజు కొనసాగుతుంది. ఇందులో భాగంగా నేడు కేంద్ర పౌర విమానయాన మంత్రి హర్దిప్ సింగ్ పూరితో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. ఢిల్లీలో టీఆర్ఎస్ కార్యాలయానికి స్థలం కేటాయించినందుకు కేంద్రమంత్రి హర్ధీప్ సింగ్‌కు సీఎం కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణలో నూతన ఎయిర్‌పోర్ట్‌ల నిర్మాణంపై కేంద్ర మంత్రి హర్దిప్‌ సింగ్‌ పూరితో చర్చించారు.

అయితే పెద్దపల్లి జిల్లాలో బసంత్ నగర్, వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో మామూనూర్, నిజామాబాద్ జిల్లాలో జక్రాన్‌ పల్లి, మహబూబ్‌నగర్ జిల్లాలో దేవరకద్ర విమానాశ్రయాల ఏర్పాటు, అవశ్యకతపై కేంద్ర మంత్రికి సీఎం కేసీఆర్ లేఖ అందించారు. ఇదే కాకుండా తెలంగాణలో నిర్మిస్తున్న డబూల్ బెడ్రూంలకు రావాల్సిన నిధులపై కూడా కేంద్ర మంత్రితో చర్చించినట్టు తెలుస్తుంది. ఇదిలా ఉంటే నిన్న కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాలను కూడా సీఎం కేసీఆర్ కలిసిన సంగతి తెలిసిందే.