కొత్త పార్టీ పెట్టి చక్రం తిప్పబోతున్న సీఎం కేసీఆర్..!

Monday, September 7th, 2020, 08:30:31 AM IST

తెలంగాణ సీఎం కేసీఆర్ ఎప్పటి నుంచో దేశ రాజకీయాలను శాసించాలని భావిస్తున్నారు. గత ముందస్తు ఎన్నికలలో టీఅర్ఎస్ వరుసగా రెండో సారి అధికారాన్ని చేపట్టడంతో అనంతరం వచ్చిన లోక్‌సభ ఎన్నికలలో కూడా విజయం తమదేనని మొత్తం 17 లోక్‌సభ స్థానాలకు గాను, 16 స్థానాలను గెలుచుకుని కేంద్రంలో చక్రం తిప్పుతామన్న వాదనలు సీఎం కేసీఆర్ వినిపించారు. అంతేకాదు దేశవ్యాప్తంగా ప్రజలలో జాతీయ పార్టీలపై తీవ్ర వ్యతిరేకత ఏర్పడిందని ప్రాంతీయ పార్టీలన్ని ఏకం చేసి ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయడం ద్వారా ప్రాంతీయ పార్టీలే అధికారంలో ఉంటాయని చెప్పుకొచ్చాడు.

అయితే ఆ ఎన్నికలలో సీఎం కేసీఆర్ అంచనాలు పూర్తిగా తలకిందులయ్యాయి. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన 17 లోక్‌సభ స్థానాలకు కాను టీఆర్ఎస్ కేవలం 9 స్థానాలను మాత్రమే గెలుచుకోగలిగింది. ఇక దేశ వ్యాప్తంగా బీజేపీ భారీ మెజారిటీతో రెండో సారి అధికారంలోకి వచ్చింది. దీంతో అప్పటి నుంచి కాస్త సైలెంట్ అయిన సీఎం కేసీఆర్ మళ్ళీ దేశ రాజకీయాలపై ఆసక్తి చూపుతున్నారని సమాచారం. త్వరలో హైదరాబాద్‌లో గ్రేటర్ ఎన్నికలు రాబోతుండడంతో ఆ ఎన్నికలలో టీఆర్ఎస్ భారీ మెజారిటీతో గెలిస్తే ప్రస్తుత టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌ని సీఎంగా ప్రకటించి కేసీఆర్ దేశ రాజకీయాలపై ఫోకస్ పెట్టేందుకు సిద్దమయ్యారట. ఇందుకోసం జాతీయ స్థాయిలో “నయా భారత్” పేరుతో కొత్త పార్టీనీ పెట్టబోతున్నట్టు టాక్ వినిపిస్తుంది. దేశంలో అధ్యక్ష తరహా ఎన్నికలు నిర్వహించాలన్న ఆలోచనలకు వ్యతిరేకంగా పనిచేసేలా కొత్త పార్టీనీ రూపొందించబోతున్నట్టు తెలుస్తుంది.