తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్న ధరణి పోర్టల్‌ను నేడు సీఎం కేసీఆర్ ప్రారంభించారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని సీఎం దత్తత గ్రామమైన మూడుచింతలపల్లిలో ధరణి పోర్టల్‌ను లాంచ్ చేశారు. రెవెన్యూ సేవలను సులభంగా అందించాలన్న లక్ష్యంతో ఏర్పాటు చేసిన ధరణి పోర్టల్ నేటి నుంచి అందుబాటులోకి వచ్చింది. ఈ కార్యక్రమంలో సీఎస్ సోమేశ్ కుమార్, మంత్రి మల్లారెడ్డి, జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లుతో పాటు పలువురు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
అయితే ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ ధరణి పోర్టల్ అందుబాటులోకి రావడంతో అక్రమ రిజిస్ట్రషన్లకు ఇకపై తావు ఉండదని, ధరణి పోర్టల్ దేశానికే ట్రెండ్ సెట్టర్‌గా నిలుస్తుందని అన్నారు. తప్పు జరిగితే భవిష్యత్ తరాలు ఇబ్బందులు పడతాయని, తప్పటడుగులు లేకుండా కఠినంగా నిర్ణయాలు తీసుకున్నామని అన్నారు. కొత్తగా జరిగే క్రయ, విక్రయాల నమోదు 15 నిమిషాల్లో పూర్తి అవుతుందని, రైతులు కార్యాలయాల చుట్టూ తిరిగే కర్మ ఉండదని అన్నారు. అంతేకాదు రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచలేదని, మునపటి ఛార్జీలనే వసూల్ చేస్తున్నట్టు చెప్పుకొచ్చాడు.