దుబ్బాకలో ఓటమికి కారణం అదే.. సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు..!

Monday, March 29th, 2021, 06:36:10 PM IST

నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ అభ్యర్థిగా నోముల భగత్‌ను సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ మేరకు టీఅర్ఎస్ భవన్‌లో సీఎం కేసీఆర్ ఆయనకు బీ ఫాంను అందజేశారు. రేపు ఉదయం నోముల భగత్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం కేసీఆర్ పార్టీలో అంతర్గత విభేదాలు పక్కనబెట్టి గెలుపు కోసం పనిచేయాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. దుబ్బాక ఉప ఎన్నికలో ప్రచారానికి వెళ్లకపోవడం వల్లే ఓడిపోయామని పార్టీ నేతలతో అన్నారు.

అయితే సర్వేలన్నీ టీఆర్‌ఎస్‌కే అనుకూలంగా ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఈ ప్రచారంలో తనతో పాటు మంత్రి కేటీఆర్‌ కూడా పాల్గొంటారని, ఎమ్మెల్సీ ఎన్నికల తరహాలో సాగర్‌లో కూడా కష్టపడాలని కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఇదిలా ఉంటే టీఆర్ఎస్ నుంచి టికెట్ ఆశించిన చెన్నపరెడ్డి, కోటిరెడ్డిలు బీజేపీకి టచ్‌లో ఉన్నారని, ఇప్పటికే వారితో సంప్రదింపులు కూడా జరిపినట్లు ప్రచారం జరుగుతుంది. అయితే చిన్నపరెడ్డికి ఎమ్మెల్సీ రెన్యువల్‌, కోటిరెడ్డికి ఎమ్మెల్సీ ఇస్తానని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని పార్టీ శ్రేణులు చెబుతున్నారు.