ఎన్నికలు వాయిదా వేసేందుకు కుట్ర.. సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు..!

Thursday, November 26th, 2020, 02:08:53 AM IST

రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితిపై నేడు సీఎం కేసీఆర్ పోలీస్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ మేరకు మీడియాతో మాట్లాడిన సీఎం కేసీఆర్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా రాజకీయ లబ్ది పొందడానికి కొందరు కుట్రలు పన్నుతున్నారని, హైదరాబాద్‌లో అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. నిరాశ నిస్పృహలో ఉన్న కొన్ని అరాచక శక్తులు మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్నారని, ఈ అరాచక శక్తుల కుట్రలకు సంబంధించి ప్రభుత్వానికి ఖచ్చితమైన సమాచారం ఉందని అలాంటి వారి పట్ల అత్యంత కఠినంగా వ్యవహరించాలని పోలీసు అధికారులను ఆదేశించారు.

తెలంగాణలో శాంతి భద్రతలు కాపాడడమే అత్యంత ప్రధానమని, సంఘ విద్రోహ శక్తులను అణచివేసే విషయంలో పోలీసులకు ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నట్టు వెల్లడించారు. అయితే జిల్లాలలో గొడవలు రాజేసి వాటిని హైదరాబాద్‌కు విస్తరించాలని చూస్తున్నారని, ఇందులో భాగంగానే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు వాయిదా వేసేందుకు కుట్రలు పన్నుతున్నారని అన్నారు. మొదట సోషల్ మీడియా ద్వారా తప్పుడు ప్రచారాలు చేశారని, ఆ తర్వాత మార్ఫింగ్ ఫోటోలతో ప్రజలను ఏమార్చాలని చూశారని అన్నారు.

తాజాగా మాటలతో కవ్వింపు చర్యలకు పూనుకున్నారని హైదరాబాద్ ప్రజలు వారి కవ్వింపు మాటలను, అబద్ధపు ప్రచారాన్ని పట్టించుకోలేదన్నారు. మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి ఎన్ని మాటలు మాట్లాడినా ప్రజల నుంచి స్పందన రాలేదని అన్నారు. ఉద్వేగాలు, ఉద్రేకాలు రెచ్చగొట్టే వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సీఎం కేసీఅర్ విజ్ణప్తి చేశారు. హైదరాబాద్ నగరమే కాకుండా రాష్ట్రంలో శాంతి భద్రతలు యథావిధిగా కొనసాగాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని, ఎట్టి పరిస్థితుల్లో సంఘ విద్రోహ శక్తుల ఆటలు సాగనీయమని సీఎం కేసీఆర్ హెచ్చరించారు.