ఇలా చేస్తే రైతులు నష్టపోయే అవకాశమే లేదు – సీఎం కేసీఆర్

Friday, May 22nd, 2020, 07:44:11 AM IST

తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల కోసమని, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే పలు కీలకమైన నిర్ణయాలు తీసుకున్న సంగతి మనకు తెలిసిందే. కాగా ఇప్పటి వరకు రైతులు అందరు కూడా మూసపద్ధతిలో వ్యవసాయం చేయడం వలన చాలా నష్టపోయారని, ఇకపై రాష్ట్రంలో అలాంటి పరిస్థితి రాకుండా ఉండేందుకు తెలంగాణా ప్రభుత్వం రైతులందరికీ కూడా అండగా ఉందని, అందుకు గాను ప్రభుత్వం నియంత్రణ పద్దతిలో పంటల సాగుకు ప్రణాళిక రూపొందించిందని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఈ మేరకు రాష్ట్రంలోని మంత్రులు, అధికారులు, కలెక్టర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం కేసీఆర్ పలు కీలకమైన అంశాలు వెల్లడించారు.

కాగా రాష్ట్రంలో ఉన్నటువంటి నేల రకాలు, ప్రస్తుతానికి ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులన్నీ కూడా పరిగణలోకి తీసుకొని, ఏ కాలంలో ఎలాంటి పంటలు వేస్తే సాగుబడి వస్తుందో అన్ని పరిశీలించి పంటలను వేయాలని, ఈ మేరకు మన శాస్త్రవేత్తలు పలు కీలకమైన నిర్ణయాలను ప్రకటించారని, అంతేకాకుండా పలు అంశాలను చెప్పారని వెల్లడించారు. కాగా ఏ పంటకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉందో అగ్రిబిజినెస్ డిపార్ట్ మెంట్ అధికారులు గుర్తించారని, అందుకు గాను ప్రభుత్వ సూచనలను రైతులందరు కూడా పాటిస్తే, రైతులకు మేలు జరుగుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు.