పంట కొనుగోలులో రైతులకు శుభవార్త చెప్పిన సీఎం కేసీఆర్..!

Friday, October 23rd, 2020, 07:51:29 PM IST

వ్యవసాయం, పంట కొనుగోలుపై నేడు ఉన్నతాధికారులతో సమీక్ష జరిపిన సీఎం కేసీఆర్ రైతులకు శుభవార్త అందించారు. వరి కోనుగోలు కోసం గ్రామాలలో ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రాలలోనే మక్కలకు కూడా మద్ధతు ధర చెల్లించి కొనుగోలు చేస్తామని ప్రకటించారు. వర్షాకాలంలో రైతులు మక్కలు సాగు చేయవద్దని ప్రభుత్వం చెప్పినా వినకుండా రైతులు మక్కలు సాగు చేశారని సీఎం కేసీఆర్ ఒకింత అసంతృప్తి వ్యక్తం చేశారు.

అయితే రైతుల నుంచి మక్కలు కొనుగోలు చేసే బాధ్యత ప్రభుత్వంపై లేదని, కానీ రైతులు నష్టపోవద్దన్న కారణంతో నష్టమొచ్చినా మక్కలు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ముందుకొచ్చిందని తెలిపారు. గత యాసంగిలో మార్క్ ఫెడ్ ద్వారా ప్రభుత్వం రైతుల నుంచి కొనుగోలు చేసిందని అప్పుడే క్వింటాళుకు 850 రూపాయల నష్టం వచ్చిందని అది దృష్టిలో ఉంచుకుని వర్షాకాలంలో మక్కలు సాగు చేయవద్దని ప్రభుత్వం రైతులను కోరిందని అన్నారు. ప్రభుత్వ విజ్ఞప్తిని, వ్యవసాయాధికారుల సూచనలు పాటించకుండా కొందరు రైతులు మక్కలు సాగుచేశారని వారు నష్టపోకుండా ఉండేందుకు మక్కలు కొనుగోలు చేస్తున్నట్టు తెలిపారు.