రైతులకు మరోసారి గుడ్‌న్యూస్ చెప్పిన సీఎం కేసీఆర్..!

Monday, March 29th, 2021, 10:32:33 PM IST

తెలంగాణలోని రైతులకు సీఎం కేసీఆర్ మరోసారి గుడ్‌న్యూస్ చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా యాసంగిలో వచ్చే వరి ధాన్యాన్ని గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రభుత్వమే పూర్తి స్థాయిలో కొనుగోలు చేయనున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. నేడు ప్రగతి భవన్‌లో వ్యవసాయ, మార్కెటింగ్, పౌర సరఫరాల శాఖలపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన సీఎం కేసీఆర్ కరోనా మరోసారి విజృంభిస్తున్న నేపథ్యంలో రైతుల ప్రయోజనాల దృష్ట్యా గత ఏడాదిలాగే గ్రామాల్లో వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని నిర్ణయించినట్లు స్పష్టం చేశారు.

అయితే ధాన్యం కొనుగోలుకు అవసరమైన 20,000 కోట్ల రూపాయలకు బ్యాంకు గ్యారంటీ ఇచ్చే ఏర్పాట్లను రేపటికే పూర్తి చేయాలని ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావును ఆదేశించారు. అయితే కొనుగోలు కేంద్రాల ఏర్పాటును, ధాన్యం కొనుగోళ్లను మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి నిరంతరం పర్యవేక్షించాలని, కొనుగోలు కేంద్రాల తక్షణ ఏర్పాటు కోసం అన్ని జిల్లాల కలెక్టర్లతో అత్యవసర వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలని సీఎస్ సోమేశ్ కుమార్‌ను ఆదేశించారు. రైతులు కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చే విషయంలో కనీస మద్దతు ధర నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని సీఎం కేసీఆర్ కోరారు.