టికెట్లు రాని వారికి నామినేటెడ్ పదవులు.. కేసీఆర్ ప్రకటన..!

Friday, January 10th, 2020, 07:42:59 AM IST

తెలంగాణలో ఈ నెల 22న జరగబోయే మున్సిపల్ ఎన్నికలకు టీఆర్ఎస్ సిద్దమవుతోంది. మున్సిపల్ ఎన్నికలపై చర్చించేందుకు నిన్న మంత్రులు, ఎమ్మెల్యేలతో సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేశారు. అయితే ఈ సమావేశంలో టీఆర్ఎస్ విజయవకాశాలే ఎక్కువగా ఉన్నాయని అందరూ కలిసికట్టుగా పనిచేయాలని ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలకు దిశా నిర్దేశం చేశారు.

అంతేకాదు మున్సిపల్‌ ఎన్నికలకు పోటీ చేస్తున్న వారి బీ ఫారాలను టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా టికెట్లు రాని వారు నిరాశపడకుండా చూడాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలదే అని కేసీఆర్‌ స్పష్టం చేశారు. టికెట్లు రాని వారికి భవిష్యత్‌లో నామినేటెడ్‌ పదవులు కల్పిస్తామని సీఎం భరోసా ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా 9 కార్పోరేషన్లు, 120 మున్సిపాలిటీలకు జరగనున్న ఈ ఎన్నికల ఫలితాలు జనవరి 25న వెలువడనున్నాయి.