ఆ బిల్లును ఖచ్చితంగా వ్యతిరేకించాలి – సీఎం కేసీఆర్

Sunday, September 20th, 2020, 01:05:01 AM IST


కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాల పై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పలుమార్లు విమర్శలు చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన వ్యవసాయ బిల్లు రైతు లోకానికి తీవ్రంగా అన్యాయం చేసే విధంగా ఉంది అంటూ కేసీఆర్ మరొకసారి తప్పుబట్టారు. రైతులను దెబ్బతీసి, కార్పొరేట్ వ్యాపారాలకు లాభం చేకూర్చేలా ఈ బిల్లు ఉంది అని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు.

అయితే ఈ బిల్లుని ఖచ్చితంగా వ్యతిరేకించాలి అని సీఎం కేసీఆర్ ఆదేశించారు. అయితే ఈ బిల్లుని వ్యతిరేకించాలి అని, అందుకు తగు కారణాలను వివరించే ప్రయత్నం చేశారు. రైతులు సరుకును ఎక్కడైనా అమ్ముకోవచ్చు,కానీ వ్యాపారస్తులు ఎక్కడికైనా వెళ్లి సరుకు కొనుగొలు చేసే విధంగా బిల్లు ఉంది అని సీఎం కేసీఆర్ అన్నారు. అయితే కార్పొరేట్ గద్దలు దేశమంతా విస్తరించడానికి, ప్రైవేట్ వ్యాపారులకు దార్లు బార్లా చేయడానికి ఈ బిల్లు ఉపయోగపడుతుంది అని తెలిపారు.

అయితే రైతులు తమకు ఉన్న కొద్దిపాటి సరుకును ఎన్నో రవాణా ఖర్చులు భరించి లారీల ద్వారా వేరే ప్రాంతానికి తీసుకు వెళ్లి అమ్మడం సాధ్యమేనా అని సూటిగా ప్రశ్నించారు. అంతేకాక,ఇది తేనె పూసిన కత్తి లాంటి చట్టం అని,దీన్ని ఖచ్చితం వ్యతిరేకించాలని సీఎం అన్నారు. ఈ బిల్లుకి వ్యతిరేఖంగా ఓటు వేయాలి అంటూ తెరాస ఎంపీ లకి సీఎం కేసీఆర్ సూచించారు.