దుబ్బాకలో బీజేపీ గెలుపుపై ఆందోళన అవసరం లేదు – సీఎం కేసీఆర్

Friday, November 13th, 2020, 12:07:00 AM IST


దుబ్బాక ఉప ఎన్నికలో ఖచ్చితంగా గెలుపు తమదే అని భావించిన టీఆర్ఎస్‌కు బీజేపీ షాక్ ఇచ్చింది. అయితే నేడు పార్టీ ముఖ్య నేతలతో సమావేశం ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్ దుబ్బాక ఓటమిపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. దుబ్బాకలో బీజేపీ విజయంపై ఎక్కువ ఆందోళన అక్కర్లేదని టీఆర్‌ఎస్ నేతలతో అన్నారు. ఉపఎన్నిక కనుక బీజేపీ అభ్యర్థికి సానుభూతి కలిసొచ్చిందని సీఎం కేసీఆర్ అభిప్రాయపడినట్టు తెలుస్తుంది.

అంతేకాదు ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత ఏ మాత్రం లేదని, బీజేపీని చూసి పెద్దగా హైరానా పడొద్దని నేతలకు సూచించారు. ఎన్నికల ప్రచారంలో బీజేపీ అబద్ధాలకు ప్రచారం చేస్తుందని, వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టాలని అన్నారు. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలతో పాటు పట్టభద్రుల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా కేసీఆర్ పార్టీ నేతలతో చర్చించినట్టు తెలుస్తుంది. ఇదిలా ఉంటే దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంతో వీలైనంత తొందరగా జీహెచ్ఎంసీ ఎన్నికలను వెళ్లాలని కూడా భావిస్తున్నట్టు తెలుస్తుంది.