కేంద్ర విద్యుత్ చట్టాన్ని తప్పుపట్టిన సీఎం కేసీఆర్.. లోపాలున్నాయి..!

Tuesday, September 15th, 2020, 04:30:46 PM IST

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలలో కేంద్రం ప్రతిపాదించిన కొత్త విద్యుత్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానం జరగగా దీనిపై స్పందించిన సీఎం కేసీఆర్ ఆ చట్టాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విద్యుత్ చట్టంలో అనేక లోపాలున్నాయని అన్నారు. అయితే దేశ ప్రజలపై ఈ చట్టాన్ని రుద్దవద్దని రాష్ట్ర హక్కులు, దేశ సమాఖ్య స్పూర్తిని గొడ్డలితో అడ్డంగా నరికే చట్టం ఇది అని అన్నారు.

అంతేకాదు రాష్ట్రంలో విద్యుత్ సమస్యలకు కాంగ్రెస్, టీడీపీనే కారణమంటూ ఆరోపించారు. కేంద్ర విద్యుత్ చట్టాన్ని టీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్‌లో ఖచ్చితంగా వ్యతిరేకిస్తుందని చెప్పుకొచ్చారు. కొత్త చట్టం ప్రకారం పొలంలో బోర్లకు మీటర్లు పెట్టాలని, మీటర్ల కోసం 700 కోట్లు అవసరం అవుతుందని అన్నారు. మీటర్ రీడింగ్ తీసి అప్పుడు బిల్లులు ముక్కు పిండి వసూల్ చేస్తారని వ్యాఖ్యానించారు. దేశంలో 4 లక్షల మెగావాట్ల విద్యుదుత్పత్తి ఉందని, మిగులు విద్యుత్‌ను దేశ ప్రగతికి వినియోగించాలనే ఉద్దేశం కేంద్రానికి అసలు లేదని సీరియస్ అయ్యారు.