వరద పరిస్థితిపై సీఎం కేసీఆర్ సమీక్ష.. వారికి 5 లక్షల ఆర్థిక సాయం..!

Thursday, October 15th, 2020, 09:17:55 PM IST


తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు, వరద పరిస్థితిపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన సీఎం కేసీఆర్ వరదల్లో చనిపోయిన వారి కుటుంబాలకు 5 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. వరదలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలకు యుద్ధ ప్రతిపాదికన సాయం అందించాలని అధికారులను ఆదేశించారు. ముంపు ప్రాంతాల ప్రజలకు మూడు రగ్గులు, బియ్యం, పప్పుతో పాటు నిత్యావసర సరుకులు, ఆహారం అందించాలని సూచించారు. అయితే వరదల్లో పాక్షికంగా ఇల్లు దెబ్బతిన్న వారికి ఆర్థిక సహాయం చేస్తామని అన్నారు.

అయితే ఇళ్లు పూర్తిగా కూలిపోయిన వారికి కొత్త ఇండ్లు మంజూరు చేస్తామని, నాలాలపై కట్టిన ఇళ్లు కూడా కొన్ని కూలిపోయాయని వాటి స్థానంలో ప్రభుత్వ స్థలంలో కొత్త ఇళ్ల నిర్మాణం చేపడతామని తెలిపారు. సహాయ కార్యక్రమాలు చేపట్టేందుకు తక్షణం జీహెచ్‌ఎంసీకి 5 కోట్లు విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఇక లోతట్టు ప్రాంతాలు, అపార్టుమెంట్ల సెల్లార్లలో నీళ్లను వెంటనే తొలగించాలని, పనులు చేయడంలో రెండు రోజులు లేటు అయిన పర్లేదు కానీ ఎలాంటి ప్రాణ నష్టం లేకుండా చూడాలని అన్నారు. నగరంలో వరదల పరిస్థితిని చూస్తే చాలా చోట్ల చెరువుల ఎఫ్‌టీఎల్‌ పరిధిలోని కాలనీలే జలమయం అయ్యాయని అన్నారు.