ఆ వెబ్‌సైట్లను బ్లాక్ చేయండి.. కేంద్ర మంత్రికి సీఎం జగన్ లేఖ..!

Thursday, October 29th, 2020, 03:01:56 AM IST

YS_Jagan

ఏపీ సీఎం జగన్ కేంద్ర ఐటీ, కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌కు తాజాగా ఓ లేఖ రాశారు. ఆన్‌లైన్ బెట్టింగ్, ఆన్‌లైన్ గేమింగ్, ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు పాల్పడే 132 వెబ్‌సైట్లను ఏపీలో నిషేధించేలా ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లను ఆదేశించాలని లేఖ ద్వారా విజ్ణప్తి చేశారు. ఆన్‌లైన్ బెట్టింగ్, ఆన్‌లైన్ గేమింగ్, ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు పాల్పడటాన్ని నేరంగా పరిగణించే విధంగా ఏపీలో చట్టం చేశామని లేఖలో పేర్కొన్నారు.

అయితే ఇలాంటి బెట్టింగ్ గేమింగ్‌లకు యువత అలవాటు పడుతుండడంతో ఆత్మహత్యలు పెరిగిపోయాయని, అంతేకాకుండా అనేక మానసిక, సామాజిక రుగ్మతులు ఏర్పడుతున్నాయని తెలిపారు. అందుకే ఏపీ గేమింగ్ యాక్ట్ 1974లో సవరణలు చేశామని, కొత్త చట్టం ప్రకారం ఇలాంటివన్నీ ఏపీలో శిక్షార్హమైన నేరాలని చెప్పుకొచ్చారు. అయితే ఇలాంటి వాటిని బ్లాక్ చేయని ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు కూడా శిక్షార్హులే అవుతారని అందుకే ఆన్‌లైన్ గేమింగ్, ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు పాల్పడే 132 వెబ్‌సైట్లను బ్లాక్ చేసే విధంగా ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లను ఆదేశించాలని సీఎం జగన్ లేఖ ద్వారా కేంద్ర మంత్రిని కోరారు.