ఏపీలో నేడు మరో కొత్త పథకం ప్రారంభించనున్న సీఎం జగన్..!

Monday, September 28th, 2020, 08:15:35 AM IST

ఏపీలో ప్రతి ఎకరానికి సాగునీరు అందించే లక్ష్యంతో ప్రభుత్వం మరో ప్రతిష్టాత్మకమైన పథకానికి శ్రీకారం చుట్టింది. నవరత్నాల హామీలలో భాగంగా అర్హులైన ప్రతి రైతుకు నీరు అందించేలా ఉచితంగా బోరుబావులను వేయించే ‘వైఎస్‌ఆర్‌ జలకళ’ పథకాన్ని నేడు సీఎం జగన్ ప్రారంభించనున్నారు.

అయితే వైఎస్ఆర్ జలకళ పథకంలో భాగంగా బోరుబావుల తవ్వకానికి ముందుగా సంబంధిత పొలంలో భూగర్భజలాల స్థాయిని శాస్త్రీయంగా సర్వే చేసి, ఆ తరువాతే సదరు పాయింట్‌లో డ్రిల్లింగ్ చేపడతారు. అయితే 2.5 ఎకరాల భూమి కలిగి ఉండి, బోరు లేని రైతులు మాత్రమే ఈ పథకం కింద అర్హులు అవుతారు. అంతేకాదు 2.5 ఎకరాల కంటే తక్కువ భూమి కలిగివున్న రైతులు ఈ పథకం ద్వారా లబ్ధిపొందాలంటే మరికొందరు రైతులతో ఒక గ్రూప్‌గా ఏర్పడి ఉచిత బోరుబావి కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. చిన్నా, సన్నకారు రైతులు, ఎస్సీ, ఎస్టీ, మహిళా రైతులకు ఈ పథకం కింద ప్రాధాన్యత కల్పిస్తున్నారు.