వైసీపీ మహిళా నాయకురాలి తీరుపై సీఎం జగన్ సీరియస్..!

Thursday, December 10th, 2020, 03:21:24 PM IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్ ఛైర్ పర్సన్‌గా నియమితులైన దేవుళ్ల రేవతి తీరుపై సీఎం జగన్ సీరియస్ అయ్యారు. గుంటూరు జిల్లా కాజా టోల్ ప్లాజా సిబ్బందితో రేవతి దౌర్జన్యానికి దిగిన ఘటనపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో సీఎం జగన్ ఆమెపై ఒకింత ఆగ్రహంతో ఉన్నట్టు తెలుస్తుంది. ఈ ఘటనపై ఆమెను వివరణ కోరడమే కాకుండా, సీరియస్ యాక్షన్ కూడా తీసుకునేందుకు జగన్ డిసైడ్ అయినట్టు సమాచారం. సీఎంఓ నుంచి రేవతికి ఫోన్ చేసి వెంటనే తాడేపల్లి రావాల్సిందిగా ఆదేశించడంతో హుటాహుటిన ఆమె తాడేపల్లి బయలుదేరి వెళ్లారు.

ఇదిలా ఉంటే ఈ రోజు ఉదయం గుంటూరు నుంచి విజయవాడ వస్తుండగా కాజా టోల్ ప్లాజా సిబ్బందిపై ఆమె దురుసుగా ప్రవర్తించారు. ఫ్రీ పాస్ లేకపోవటంతో రేవతిని టోల్ సిబ్బంది టోల్ కట్టాల్సిందిగా కోరారు. కార్పొరేషన్ ఛైర్ పర్సన్ అయిన నన్నే టోల్ ఫీజు కట్టమంటారా అంటూ తన కారుకు అడ్డుగా పెట్టిన బారికేట్లని స్వయంగా ఆమె తోసేశారు. అంతటితో ఆగకుండా సిబ్బందిపై దౌర్జన్యానికి దిగారు. టోల్ ఫీజు చెల్లించేందుకు నిరాకరించడమే కాకుండా తమపై దాడికి దిగినందుకు చర్యలు తీసుకోవాలని టోల్ ప్లాజా సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడంతో ఆమెపై కేసు నమోదయ్యింది.