అక్రమాస్తుల కేసులో హైకోర్ట్‌ను ఆశ్రయించిన సీఎం జగన్..!

Monday, January 27th, 2020, 07:51:43 PM IST

ఏపీ సీఎం జగన్ తనపై ఉన్న అక్రమాస్తుల కేసులో హైకోర్ట్‌ను ఆశ్రయించారు. ఈడీ కేసులో వ్యక్తిగత హాజర్ మినహాయింపు కోరుతూ జగన్ తరుపున న్యాయవాదులు దాఖలు చేసిన పిటీషన్‌ను మొన్న నాంపల్లి సీబీఐ ప్రత్యేక కోర్ట్ కొట్టిపారేసింది. అయితే అక్రమాస్తుల కేసులకు సంబంధించి ఈడీ దాఖలు చేసిన ఐదు ఛార్జీషీట్లలో సీఎం జగన్ ఏ1 నిందితుడిగా ఉన్నారు. ఈ కేసులో మినహాయింపు ఇవ్వడం వలన నిందితుడు సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని, సీఎంగా ఉన్న వ్యక్తికి మినహాయింపు ఇస్తే కేసు దర్యాప్తుపై ప్రభావం చూపవచ్చని అందుకే జగన్‌కి ఈ కేసులో ఎలాంటి మినహాయింపు ఇవ్వకూడదని ఈడీ తరపు న్యాయవాదులు కోర్ట్‌లో తెలిపారు.

అయితే ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం జగన్ పెట్టుకున్న పిటీషన్‌ను కొట్టిపారేసింది. అయితే సీబీఐ కోర్టు విచారణ నుంచి వ్యక్తిగత హాజరుపై మినహాయింపు దక్కకపోవడంతో తాజాగా సీఎం జగన్ హైకోర్ట్‌ను ఆశ్రయించారు. ఏపీ సీఎంగా పరిపాలనాపరమైన విధులు నిర్వర్తించాల్సిన బాధ్యత తనపై ఉందని తనకు వ్యక్తిగత హాజరు మినహాయింపు కావాలని పిటీషన్‌లో పేర్కొన్నారు. అయితే గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్ హైకోర్టులో ఇదే రకమైన మినహాయింపు పిటీషన్ వేయగా అప్పట్లో దానిని హైకోర్ట్ కొట్టిపారేసింది.