వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోతుల సునీత.. బీఫామ్ అందించిన సీఎం జగన్..!

Monday, January 11th, 2021, 03:34:47 PM IST

ఏపీలో ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ పోస్టును భర్తీ చేసేందుకు కొద్ది రోజుల క్రితమే ఎన్నికల కమీషన్ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే జనవరి 11 నుంచి 18 వరకు ఈ నామినేషన్ వేసేందుకు గడువు ఉండగా జనవరి 28న పోలింగ్ జరగనుంది. అయితే ఈ ఎమ్మెల్సీ స్థానానికి వైసీపీ తరపున మాజీ ఎమ్మెల్సీ పోతుల సునీత పేరు ఖరారయ్యింది. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన మూడు నెలల్లోనే పోతుల సునీత మళ్లీ ఎమ్మెల్సీగా ఎన్నికవ్వబోతున్నారు.

అయితే తనను ఎమ్మెల్సీగా నామినేట్ చేసినందుకు పోతుల సునీత సీఎం జగన్‌ని కలిసి ధన్యావాదాలు తెలిపారు. ఈ సందర్భంగా జగన్ పోతుల సునీతకు బీఫామ్ అందించారు. నామినేషన్ అనంతరం మాట్లాడిన పోతుల సునీత 20ఏళ్ల పాటు నేను టీడీపీలో పనిచేశానని, చంద్రబాబు నాయుడు నన్ను రాజకీయాల్లో ఎదగనివ్వలేదని అందుకే టీడీపీని వదిలి వైసీపీలో చేరానని అన్నారు. పేదలకు సీఎం జగన్ అందిస్తున్న సంక్షేమ ఫలాలను అడ్డుకునేందుకు చంద్రబాబు విశ్వప్రయత్నాలు చేస్తున్నారని ఆమె విమర్శలు గుప్పించారు. జగన్ నిబద్ధత కలిగిన నాయకుడని మళ్లీ నాకు ఎమ్మెల్సీగా ఛాన్స్ ఇవ్వడంపట్ల సంతోషంగా ఉందని అన్నారు. వైసీపీ బలోపేతం కోసం మరింత కృషి చేస్తానని సునీత తెలిపారు.