నిరుపేదల కోసం వైఎస్సార్ భీమా పథకం – సీఎం జగన్

Wednesday, October 21st, 2020, 01:38:18 PM IST

వరుస సంక్షేమ పథకాలతో దూసుకుపోతున్న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, మరొక కీలక నిర్ణయం తీసుకొని నిరుపేదలను ఆదుకుంటుంది. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరొక ప్రతిష్టాత్మక పథకాన్ని నేడు ప్రారంభించారు. నిరుపేద కుటుంబాలకు అండగా నిలిచేందుకు వైఎస్సార్ భీమా పథకం ప్రవేశ పెట్టడం జరిగింది. తాడేపల్లి లోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించారు. బియ్యం కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి ఈ పథకం అమలు కానున్నట్లు తెలుస్తోంది.

ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. కోవిడ్ మహమ్మారి తో ఆర్ధిక సంక్షోభం లో ఉన్నటువంటి పేదలకు మేలు చేయాలన్న సంకల్పం తో ఈ పథకం ప్రవేశ పెట్టినట్లు వివరించారు. నిరుపేదల కోసం ఈ వైఎస్సార్ భీమా పధకం తీసుకొచ్చినట్టు తెలిపారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రీమియం భరిస్తుంది అని తెలిపారు, ఏడాదికి 510 కోట్ల రూపాయల ప్రీమియం చెల్లిస్తున్న విషయాన్ని జగన్ మోహన్ రెడ్డి తెలిపారు.

అయితే 1.41 కోట్ల కుటుంబాలకు ఈ పథకం వర్తిస్తుంది అని, అంతేకాక గ్రామ సచివాలయంలో ఇన్సూరెన్స్ జాబితా కూడా ప్రవేశ పెడతాం అని సీఎం జగన్ వివరించారు. అయితే 18 నుండి 50 ఏళ్ల వయసు మద్యలో ఉన్న వారు ప్రమాదవశాత్తూ మరణిస్తే 5 లక్షల రూపాయల భీమా అని, సహజ మరణం కి 2 లక్షల రూపాయల భీమా, పాక్షిక వైకల్యం కలిగితే 1.50 లక్షల భీమా అని తెలిపారు. 51 నుండి 70 ఏళ్ల వయసు గల వారు మరణిస్తే భీమా మూడు లక్షల రూపాయలు అని, అయితే ప్రమాదవశాత్తూ చనిపోయిన వారి కుటుంబీకులకు తక్షణం 10 వేల రూపాయలను గ్రామ సచివాలయాల ద్వారా అందిస్తాం అని జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. సీఎం జగన్ ప్రవేశ పెట్టిన ఈ పథకం పై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.