రిటైర్మెంట్ గిఫ్ట్: నీలం సాహ్నికి కీలక బాధ్యతలు అప్పచెప్పనున్న సీఎం జగన్..!

Tuesday, December 15th, 2020, 01:20:11 AM IST

ఏపీ ప్రస్తుత సీఎస్ నీలం సాహ్ని పదవికాలం ఈ నెలాఖరుకు ముగియనుంది. డిసెంబర్ 31న ఆమె పదవీ విరమణ చేయబోతున్నారు. అయితే వాస్తవానికి ఆమె పదవి కాలం జూన్ 30తోనే ముగియనుండగా, రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు కేంద్ర ప్రభుత్వం ఆరు నెలల పాటు ఆమె సర్వీసును పొడిగించింది. అయితే ఇక పొడిగింపు అవకాశం లేకపోవడంతో కొత్త చీఫ్ సెక్రటరీని నియమించనున్నారు.

ఈ నేపధ్యంలో నీలం సాహ్ని రిటైర్ అయిన వెంటనే సీఎం జగన్ ఆమెకు మరో కీలక బాధ్యతలు అప్పగించనున్నట్టు తెలుస్తుంది. ఏపీ ప్రభుత్వ సలహాదారుగా ఆమెను నియమించబోతున్నారని సమాచారం. ఇప్పటి వరకు ప్రభుత్వ అధికారిగా ఆమె సేవలను వినియోగించుకున్న ప్రభుత్వం, ఇకపై ప్రభుత్వ సలహాదారు రూపంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం, నిధులు, ఇతరత్రా పనులకు సంబంధించిన వ్యవహారాలు చూసే బాధ్యతలు ఆమెకు ఇవ్వనున్నట్టు తెలుస్తుంది. ఇక ఇదిలా ఉంటే కొత్త సీఎస్ రేసులో ఆదిత్యనాథ్‌ దాస్‌ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.