రైతులకు ఇచ్చే విద్యుత్ ఎప్పటికి ఉచితమే.. సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు..!

Thursday, September 3rd, 2020, 04:58:56 PM IST

YS_Jagan

ఏపీ సీఎం అధ్యక్షతన నేడు జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా ఉచిత విద్యుత్‌ పథకం నగదు బదిలీకి సంబంధించిన అంశానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అయితే ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ రైతులకు అందే విద్యుత్‌ ఎప్పటికీ ఉచితమేనని అన్నారు. ఒక్క కనెక్షన్ ‌కూడా తొలగించమని, ప్రస్తుతం ఉన్న కనెక్షన్లను రెగ్యులరైజ్‌ చేస్తామని అన్నారు.

అంతేకాదు కనెక్షన్‌ ఉన్న రైతులకు వారి పేరు మీద ప్రత్యేక ఖాతా తెరుస్తామని, ఆ ఖాతాలో ప్రభుత్వమే డబ్బులు జమ చేస్తుందని ఆ డబ్బును రైతులు డిస్కంలకు చెల్లిస్తే సరిపోతుందని అన్నారు. అయితే ఇదంతా ప్రభుత్వమే చూసుకుంటుందని మీటర్ల ఖర్చు కూడా ప్రభుత్వమే భరిస్తుందని అన్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ సంస్కరణల వలన రైతులపై ఒక్క పైసా భారం కూడా పడదని అన్నారు. రైతులకు ఉచిత విద్యుత్‌ తీసుకొచ్చిన ఘనత వైఎస్ఆర్‌దే అని అన్నారు. ఆనాడు ఉచిత విద్యుత్‌ కుదరదు, సాధ్యంకాదని చంద్రబాబు గారు ఎద్దేవా చేశారని గుర్తు చేశారు.