ప్రభుత్వ సలహాదారులను తగ్గించే యోచనలో జగన్ సర్కార్..!

Thursday, August 27th, 2020, 08:14:10 AM IST

ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత సీఎం జగన్ దాదాపు 30 మందికి పైగా సలహాదారులను నియమించారు. అయితే ఈ సలహాదారుల విషయంలో జగన్ కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్టు సమాచారం. ప్రస్తుతం సజ్జల రామకృష్ణారెడ్డి, జీవీడీ కృష్ణమోహన్ వంటి వారు మాత్రమే సీఎం జగన్‌కు దగ్గరగా ఉంటూ ప్రభుత్వానికి, పాలనకు సంబంధించిన సూచనలు అందిస్తున్నారు. మిగిలిన వారిలో చాలా మందికి సీఎం జగన్‌ను కలిసే సందర్భాలు, సలహాలు ఇచ్చే పరిస్థితులు కూడా లేవని వీరికి క్యాబినెట్ ర్యాంక్ కల్పించడం వృధా అని అధికార పార్టీలోనే అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.

అయితే వీరికి ఇచ్చే జీత-భత్యాలు కూడా ఎక్కువగానే ఉన్నాయని ఒక్కొక్కరికి నాలుగు నుంచి ఐదు లక్షల రూపాయలు ప్రభుత్వం చెల్లిస్తుందని, దీనికి తోడు పీఎస్‌, అడిషనల్‌ పీఎస్‌, అటెండర్, డ్రైవర్ల వంటి సిబ్బంది జీతాలు, కార్యాలయ ఖర్చు కూడా ప్రభుత్వం భరిస్తుందని, ఆ ఖర్చులన్నీ తగ్గించుకోవడం బెటర్ అనే నిర్ణయానికి ప్రభుత్వం వచ్చినట్టు సమాచారం. అయితే ప్రభుత్వ సలహదారుల పదవీకాలం రెండేళ్లు కావడం, వారి పదవీకాలం పూర్తయిన తర్వాత వారిలో కొందరిని పునర్నియామకం చేయకూడదని జగన్ సర్కార్ అభిప్రాయపడుతున్నట్టు తెలుస్తుంది.