వారికి చప్పట్లు కొట్టి అభినందిద్దాం.. రాష్ట్ర ప్రజలకు సీఎం జగన్ పిలుపు..!

Friday, October 2nd, 2020, 06:19:06 PM IST

కరోనా వారియర్స్ వైద్యులు, పోలీసులు, పారిశుధ్య కార్మికులను చప్పట్లతో అభినందించాలని గతంలో దేశ ప్రజలకు ప్రధాని నరేంద్రమోదీ ఇచ్చిన పిలుపుకు మంచి స్పందన లభించిన సంగతి తెలిసిందే. సామాన్య జనంతో పాటు వివిధ రాష్ట్రాల సీఎంలు, సినీ ప్రముఖులు కూడా ఇంటి బయటకు వచ్చి చప్పట్లు కొట్టి వారికి అభినందనలు తెలియజేశారు.

అయితే సంక్షేమ పథకాలన్ని ప్రజల గడపకే నేరుగా చేరాలన్న ఉద్దేశ్యంతో గత ఏడాది అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థను సీఎం జగన్ ప్రారంభించారు. అయితే ఈ వ్యవస్థకు నేటితో ఏడాది పూర్తయిన సందర్భంగా గ్రామ స్వరాజ్యాన్ని సాధ్యం చేస్తున్న వారికి అభినందనలు చెప్పాలని, అందులో భాగంగానే ఈ రోజు రాత్రి 7 గంటలకు చప్పట్లు కొట్టి వారిని మరింత ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. అయితే సీఎం జగన్ కూడా తన నివాసం నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొంటారని ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు తెలిపారు.