ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు బుద్ధి చెప్పండి – భట్టి విక్రమార్క

Saturday, March 13th, 2021, 07:44:33 AM IST

రేపు జరగబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు ఓటేసి టీఆర్ఎస్, బీజేపీలకు బుద్ధి చెప్పాలని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పట్టభద్రులకు విజ్ణప్తి చేశారు. పెట్రోల్, గ్యాస్‌ ధరల పెరుగుదలను నిరసిస్తూ భట్టి చేసిన సైకిల్‌ యాత్ర నిన్నటితో ముగిసింది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన భట్టి విక్రమార్క రాష్ట్రంలో 1,91,000 ఉద్యోగ ఖాళీలున్నాయని రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిషన్‌ చెబుతుంటే, అసలు ఖాళీలే లేవని, అన్నీ భర్తీ చేశామని టీఆర్‌ఎస్‌ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

అయితే ఏపీలోని విశాఖ ఉక్కు కోసం పోరాడతామని ప్రకటించిన కేటీఆర్ బయ్యారం ఉక్కు గురించి ఎందుకు పోరాటం చేయడం ప్రశ్నించారు. ఏడేళ్లుగా ఉద్యోగులను పట్టించుకోని సీఎం కేసీఆర్‌, కేటీఆర్‌ ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్ల కోసం ఫిట్మెంట్‌ పెంచామని ఉద్యోగ సంఘాలతో ప్రచారం చేయించుకుంటున్నారని ఉద్యోగులు వారి మాయ మాటలు నమ్మి మోసపోకండని అన్నారు. ఇక షర్మిల పార్టీపై కూడా స్పందించిన భట్టి ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చని, షర్మిల పెట్టే పార్టీతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి నష్టం ఉండబోదని స్పష్టం చేశారు.