సిద్దిపేటలో ఉద్రిక్తత.. టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ..!

Tuesday, November 3rd, 2020, 02:14:56 AM IST


దుబ్బాక ఉప ఎన్నిక తీవ్ర ఉద్రిక్తతలకు దారితీస్తుంది. ఎన్నికల ప్రచారం మొదలైనప్పటి నుంచి టీఆర్ఎస్, బీజేపీల మధ్య తీవ్ర వాగ్వివాదం నడుస్తుంది. ఇరు పార్టీల నేతలు ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేల్చుకోగా మరోవైపు డబ్బు కట్టల వ్యవహారం కూడా పెను దుమారం రేపింది. అయితే రేపు పోలింగ్‌కి సర్వం సిద్దం కాగా తాజాగా సిద్దిపేటలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. స్వర్ణ ప్యాలెస్ లాడ్జ్ దగ్గర టీఆర్‌ఎస్‌, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ ఏర్పడింది.

స్వర్ణ ప్యాలెస్ లాడ్జ్‌లో ఆంధోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ తదితరులు ఉండగా అక్కడికి తనిఖీ కోసం వచ్చిన బీజేపీ కార్యకర్తలు ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ గదిలోకి చొచ్చుకెళ్ళేందుకు ప్రయత్నించారు. దీంతో టీఆర్ఎస్ కార్యకర్తలు తీవ్రంగా ప్రతిఘటించారు. రెండు వర్గాలు తలపడడంతో తీవ్రంగా తోపులాట జరిగింది. పోలీసులు రంగంలోకి దిగి ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఈ ఘటనలో పలువురు కార్యకర్తలకు గాయాలయ్యాయి.