చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా ఎన్వీ రమణ ప్రమాణ స్వీకారం.. చిరంజీవి అభినందనలు..!

Saturday, April 24th, 2021, 03:05:52 PM IST

భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు 48వ చీఫ్ జస్టిస్‌గా ఎన్వీ రమణ నేడు ప్రమాణ స్వీకారం చేశారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. సుప్రీం కోర్టు సీజేఐగా ఉన్న జస్టిల్ బోబ్డే పదవీకాలం నిన్నటితో ముగియడంతో ఆయన స్థానంలో ఎన్వీ రమణ నేడు బాధ్యతలు స్వీకరించారు. 2022 ఆగస్టు 26 వరకు సుప్రీం ప్రధాన న్యాయమూర్తిగా ఎన్వీ రమణ వ్యవహరించనున్నారు. అయితే సుప్రీం కోర్టు ప్రధాన నాయయమూర్తిగా నియమితులైన రెండో తెలుగు వ్యక్తి జస్టిస్ ఎన్వీ రమణ కాగా, గతంలో జస్టిస్ కోకా సుబ్బారావు సీజేఐగా బాధ్యతలు నిర్వహించిన సంగతి తెలిసిందే.

ఇదిలా ఉంటే చీఫ్ జస్టిస్‌గా నేడు ప్రమాణ స్వీకారం చేసిన ఎన్వీ రమణకు తెలుగు వారి నుంచి శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయి. ఈ క్రమంలో మెగస్టార్ చిరంజీవి కూడా ట్విట్టర్ ద్వారా జస్టీస్ ఎన్వీ రమణకు శుభాభినందనలు తెలియచేశాడు. ‘మన తెలుగు తేజం ఎన్‌వీ రమణగారు సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్‌గా ఈరోజు పదవీ బాధ్యతలు స్వీకరిస్తున్న సందర్భంగా వారికి శుభాభినందనలు అంటూ వ్యవసాయ కుటుంబంలో పుట్టి విద్యార్థి దశ నుంచే రైతుల పక్షాన నిలిచి పోరాడిన రైతు బిడ్డ, సామాన్యుల కష్టం తెలిసిన పాత్రికేయుడు, గత 40 ఏళ్లుగా న్యాయ క్షేత్రంలో నిత్య కృషీవలుడు శ్రీ రమణ గారు. అత్యున్నత న్యాయస్థానంలో అత్యున్నత పదవి 55 సంవత్సరాల తరువాత చేపడుతున్న ఈ తెలుగు బిడ్డను చూసి ఆయన పుట్టిన ఊరు పులకించిపోతుందని చిరంజీవి ట్వీట్ చేశాడు.