సీఎం కేసీఆర్‎ను విమర్శించే అర్హత బండి సంజయ్‌కు లేదు – వినయ్ భాస్కర్

Wednesday, January 6th, 2021, 05:04:06 PM IST

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఉద్యమం నడుస్తున్నప్పుడు తొండి సంజయ్ ఎక్కడున్నారని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్‎ను విమర్శించే అర్హత బండి సంజయ్‌కు లేదని మండిపడ్డారు. సీఎం కేసీఆర్‌పై ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే నాలుక చీరేస్తామని అన్నారు. బీజేపీ నేతలు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడితే బాగుంటుందని, మాట్లాడే ముందు జాగ్రత్త లేదంటే ఖబర్ధార్ అంటూ వినయ్ భాస్కర్ హెచ్చరించారు.

కాగా నిన్న వరంగల్ జిల్లా పర్యటనలో బండి సంజయ్ కేసీఆర్ మందు తాగి పాలన సాగిస్తూ రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని, బీజేపీని చూస్తే కేసీఆర్‌కు భయమేస్తోందని అన్నారు. వరంగల్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం రూ. 196 కోట్ల రూపాయలు ఇస్తే కేవలం 40 కోట్లు మాత్రమే ఖర్చు చేసి మిగతా నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్ళించిందని ఆరోపణలు చేశారు. వరంగల్‌లో టీఆర్ఎస్ నాయకులు భూకబ్జాలకు పాల్పడుతున్నారని అన్నారు. వరంగల్ అభివృద్ధిపై భద్రకాళీ టెంపుల్‌లో ప్రమాణానికి నేను సిద్దమని, వరంగల్ ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రమాణానికి సిద్దమా అని బండి సంజయ్ ప్రశ్నించారు.