దుబ్బాక బైపోల్: కాంగ్రెస్‌లో చేరనున్న టీఆర్ఎస్ నేత చెరుకు శ్రీనివాస్ రెడ్డి..!

Tuesday, October 6th, 2020, 01:24:18 PM IST

టీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి చెరుకు ముత్యం రెడ్డి తనయుడు చెరుకు శ్రీనివాస్ రెడ్డి నేడు సాయంత్రం కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్టు తెలుస్తుంది. గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ టికెట్ దక్కకపోవడంతో మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి, ఆయన కుమారుడు శ్రీనివాస్ రెడ్డితో కలిసి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. అయితే ముత్యంరెడ్డికి రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ పదవి ఇస్తానని కేసీఆర్ హామీ ఇచ్చినా ఎన్నికల అనంతరం ముత్యం రెడ్డి అనారోగ్యంతో మరణించడంతో ఆయన కుమారుడు శ్రీనివాస్ రెడ్డిని అధిష్టానం పెద్దగా పట్టించుకోవడం లేదని దీంతో ఆయన వర్గం అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తుంది.

అయితే 2018 ఎన్నికలలో దుబ్బాక నుంచి గెలిచిన టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ఇటీవల మరణించడంతో మళ్ళీ ఉప ఎన్నిక జరగబోతుంది. అయితే ఈ సారి తనకు టికెట్ ఖచ్చితంగా వస్తుందని భావించిన చెరుకు శ్రీనివాస్ రెడ్డికి నిరాశే మిగిలింది. టీఆర్ఎస్ తరుపున సోలిపేట రామలింగారెడ్డి భార్య సుజాతకే టికెట్ ఇస్తున్నట్టు నిన్న సీఎం కేసీఆర్ ప్రకటించారు. దీంతో ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు నేను పోటీ చేసేది అని అసహనంతో ఉన్న శ్రీనివాస్ రెడ్డి పార్టీనీ వీడేందుకు పూర్తిగా సిద్దమైపోయారు. కాంగ్రెస్ పార్టీ తరపున టికెట్ ఇస్తామని టీపీసీసీ శ్రీనివాస్ రెడ్డికి హామీ ఇవ్వడంతో నేడు సాయంత్రం టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఏదేమైనా చెరుకు శ్రీనివాస్ రెడ్డి పార్టీనీ వీడడం టీఆర్ఎస్‌కు ఒకింత నష్టమనే చెప్పాలి.