బిగ్ న్యూస్: నూతన్ నాయుడు చేసిన మరో కొత్త మోసం వెలుగులోకి..!

Saturday, September 5th, 2020, 07:31:36 AM IST

Nutan Naidu

సినీ నిర్మాత, బిగ్ బాస్ ఫేమ్ నూతన్ నాయుడు చేసిన మరో కొత్త మోసం వెలుగులోకి వచ్చింది. నూతన్ నాయుడు ఇంట్లో జరిగిన దళిత యువకుడి శిరోముండనం కేసులో అతడి ప్రమేయం కూడా ఉందని నిర్ధారించిన పోలీసులు నిన్న కర్ణాటకలోని ఉడుపిలో అరెస్ట్ చేశారు. అయితే తాజాగా నూతన నాయుడిపై మరో కేసు నమోదయ్యింది. ఏపీ సీఎంవో ఆఫీసులో పనిచేసే రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పేరు చెప్పి డబ్బులు డిమాండ్ చేసినట్టు తెలుస్తుంది.

అయితే సీఎంవో కార్యాలయంలో అడిషనల్ చీఫ్ సెక్రటరీ టు సీఎం హోదాలో పనిచేస్తున్న పీవీ రమేష్ పేరు వాడుకుని మోసానికి పాల్పడ్డాడు. తన పేరుతో నూతన్ నాయుడు కొందరు ప్రభుత్వ అధికారులు, ఇతరులకు ఫోన్లు చేసి డబ్బులు, ఇతర ప్రయోజనాలు డిమాండ్ చేసినట్టు తన దృష్టికి వచ్చిందని పీవీ రమేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇది మోసానికి పాల్పడడమే కాదు, తన పేరు ప్రతిష్టలను కూడా నాశనం చేశాడని పీవీ రమేష్ ఆరోపించారు. దీనిపై కూడా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.