ఏపీలో లా అండ్ ఆర్డర్ అదుపుతప్పింది.. డీజీపీకి లేఖ రాసిన చంద్రబాబు..!

Friday, December 11th, 2020, 02:00:42 AM IST

ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. పులివెందుల నియోజకవర్గంలో ఓ దళిత మహిళపై జరిగిన హత్యాచార ఘటనపై స్పందిస్తూ రాష్ట్రంలో శాంతిభద్రతలు అమలు కావడం లేదని, మేకలు మేపుకోవడం కోసం వెళ్లిన దళిత మహిళ నాగమ్మను అతిదారుణంగా అత్యచారం చేసి, చంపడం చాలా దారుణమని లేఖలో పేర్కొన్నారు.

అయితే రాష్ట్రంలో జరుగుతున్న ఇటువంటి సంఘటనలతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అమలు కావడం లేదని ఆరోపించారు. అధికార పార్టీ అండతో దళితులు, ఆదివాసీలు, మైనారిటీలు, మహిళలపై దాడులు పెరిగిపోయాయని అన్నారు. సీఎం సొంత నియోజకవర్గంలోనే మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, దళిత మహిళ నాగమ్మ హత్యాచారానికి కారకులైన దోషులను రక్షించాలని చూస్తున్నారని చెప్పుకొచ్చారు. లా అండ్ ఆర్డర్ అదుపు తప్పడంతోనే ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చట్టాన్ని అమలు చేసి బాధితులకు న్యాయం చేయాలని లేఖ ద్వారా కోరారు.