విజయసాయిరెడ్డి కారుపై దాడి కేసు.. A!గా చంద్రబాబు పేరు..!

Saturday, January 23rd, 2021, 08:13:32 AM IST

విజయనగరం జిల్లా రామతీర్థంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కారు‌పై జరిగిన దాడి కేసులో టీడీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు నాయడును పోలీసులు నిందితుడిగా చేర్చారు. ఈ కేసుకు సంబంధించిన ఎఫ్‌ఐఆర్‌లో చంద్రబాబు పేరును A1గా నమోదు చేయగా, A2గా టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడును, A3గా టీడీపీ సీనియర్ నేత కళా వెంకట్రావులతో పాటుగా మరికొందరిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇదిలా ఉంటే రామతీర్థంలో శ్రీరాముడి విగ్రహం ధ్వంసం ఘటనను నిరసిస్తూ ఈ నెల 2వ తేదీన చంద్రబాబు నాయుడు రామతీర్థంకు వచ్చారు. అయితే అదే రోజు చంద్రబాబు కంటే ముందుగానే అక్కడికి చేరుకున్న విజయసాయిరెడ్డి కొండపైకి వెళ్లి రాముని విగ్రహం ధ్వంసం అయిన ప్రాంతాన్ని పరిశీలించారు. కొండపై ఆలయాన్ని పరిశీలించి బయటకు వచ్చిన విజయసాయిరెడ్డిని టీడీపీ, బీజేపీ శ్రేణులు అడ్డుకున్నాయి. ఈ క్రమంలోనే కొందరు వ్యక్తులు విజయసాయిరెడ్డి కారుపై రాళ్లతో దాడి చేశారు. ఘటనపై విజయసాయిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ దాడి ఘటనకు సంబంధించి పోలీసులు ఇప్పటికే ఏడుగురు టీడీపీ నేతలను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా వారికి కోర్టు 14 రోజులపాటు రిమాండ్ విధించింది. మరోవైపు ఈ కేసుకు సంబంధించి ఈ నెల 20వ తేదిన కళా వెంకట్రావును కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. దీనిపై టీడీపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో 41ఏ నోటీసులు ఇచ్చి పోలీసులు ఆయనను విడుదల చేశారు.