ఎస్ఈసీ నిమ్మగడ్డకు లేఖ రాసిన చంద్రబాబు.. వైసీపీపై ఫిర్యాదు..!

Wednesday, February 10th, 2021, 03:00:24 AM IST

Nimmagadda-Ramesh-Kumar
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌కు తాజాగా ఓ లేఖ రాశారు. టీడీపీ బలపరిచిన అభ్యర్థులు గెలిచిన చోట ఫలితాలు తారుమారు చేసేందుకు వైసీపీ యత్నిస్తోందని చంద్రబాబు ఫిర్యాదు చేశారు. అంతేకాదు రిటర్నింగ్ అధికారులపై ఒత్తిడి తెచ్చి ఫలితాలను తారుమారు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లా మహానందిలోని బుక్కాపురం, నంద్యాల రూరల్ బిల్లాలపురంలో రీ కౌంటింగ్ జరిపి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చాంద్రబాబు ఎస్ఈసీని కోరారు.

ఇదిలా ఉంటే పంచాయితీ ఎన్నికల తొలి విడత ఫలితాలు ఉత్కంఠ రేపుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 12 జిల్లాల్లో తొలివిడతలో భాగంగా 3,249 గ్రామ పంచాయతీలకు నోటిఫికేషన్ ఇవ్వగా 525 చోట్ల ఏకగ్రీవమయ్యాయి. ఇందులో 500 పంచాయతీలు వైసీపీ మద్దతుదారులు, 18 చోట్ల టీడీపీ మద్దతుదారులు, 7చోట్ల ఇతరులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో నేడు 2,723 గ్రామ పంచాయతీలు, 20,157 వార్డులకు ఎన్నికలు జరిగాయి. అయితే ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో వైసీపీ మద్దతుదారులు మెజారిటీ స్థానాల్లో గెలవగా, టీడీపీకి ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదు.