ఏపీ గవర్నర్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లేఖ..!

Friday, January 1st, 2021, 03:00:26 AM IST


టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు గవర్నర్‌ విశ్వభూషణ్ హరిచందన్‌కు లేఖ రాశారు. ఏపీలో అధికార యంత్రాంగం పూర్తిగా వైఫల్యం అయ్యిందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో హత్యలు, అత్యాచారాలు, వేధింపులు పెరిగిపోయాయని ఆరోపణలు చేశారు. అంతేకాదు తాడిపత్రిలో జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇంటిపై వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి వెళ్ళి దాడికి పాల్పడడం చూస్తేనే అరాచకం ఎలా ఉందో అర్ధం చేసుకోవాలని అన్నారు.

అయితే వైసీపీ ప్రభుత్వం చేస్తున్న తప్పులను ప్రశ్నించిన వారిని భయపెట్టడం, బెదిరించడం చేస్తున్నారని అన్నారు. టీడీపీ నేతలపై, కార్యకర్తలపై కూడా తప్పుడు కేసులు బనాయించి వేధిస్తున్నారని లేఖలో పేర్కొనారు. కొందరు పోలీసులు వైసీపీ నేతలతో కుమ్మక్కు అయ్యారని దీనిపై గవర్నర్‌ తక్షణమే జోక్యం చేసుకొని రాజ్యాంగాన్ని పరిరక్షించాలని చంద్రబాబు లేఖ ద్వారా కోరారు.