ఏపీ డీజీపీకి చంద్రబాబు లేఖ.. ఆ నోటీసులపై ఆగ్రహం..!

Friday, December 18th, 2020, 11:48:13 PM IST

ఏపీ డీజీపీ గౌతం సవాంగ్‌కి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. టీడీపీ నేతలకు పోలీసులు జారీ చేసిన నోటీసులు ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా దిగజారిపోయాయని అన్నారు. ప్రాథమిక హక్కులు అణిచివేతపై కొందరు పోలీసులు శ్రద్ధ చూపుతున్నారని అన్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అణచివేత విచ్చలవిడిగా సాగుతుందని అన్నారు.

అయితే ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు అధికార పార్టీతో కుమ్మక్కవటం బాధాకరమని అన్నారు. టీడీపీ నేతలకు జారీ చేసిన నోటీసులే ఇందుకు నిదర్శనమని, బహిరంగ ప్రదేశాల్లో సమావేశం కారాదని నోటీసుల్లో పేర్కొన్నారని అన్నారు. అమరావతి పరిరక్షణ కోసం శాంతియుతంగా ఉద్యమం చేస్తున్న టీడీపీ కార్యకర్తలకు పోలీసులు నోటీసులు ఇవ్వడం దారుణమని అన్నారు. శాంతిభద్రతల పరిరక్షణపై దృష్టి పెట్టాలని డీజీపీకి విజ్ఞప్తి చేశారు.