ప్రధాని నరేంద్ర మోడీ కి చంద్రబాబు లేఖ…ఎందుకంటే?

Sunday, February 21st, 2021, 09:25:39 AM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల అటు అధికార పార్టీ వైసీపీ, ఇటు తెలుగు దేశం పార్టీ లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ మేరకు తెలుగు దేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోడీ కి లేఖ రాశారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రక్రియ ను నిలిపివేయాలి అంటూ చెప్పుకొచ్చారు. సొంత గనులు లేకపోవడం, రుణాల పై అధిక వడ్డీలు చెల్లించాల్సి రావడం వలన విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉందని, కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వం సొంత గనులు కేటాయిస్తే మళ్ళీ లాభాల బాట పడుతుంది అని చంద్రబాబు లేఖ లో తెలిపారు. అయితే కులమతాలకు అతీతంగా తెలుగు ప్రజలంతా ఏకతాటి పై పోరాడి 32 బలిదానం తో విశాఖ ఉక్కు పరిశ్రమ సాకారం అయింది అని, దాన్ని ప్రైవేట్ పరం చేయొద్దు అంటూ చెప్పుకొచ్చారు.

అయితే ఉక్కును వ్యూహాత్మక రంగం గా కేంద్రం గుర్తించింది అని చంద్రబాబు పేర్కొన్నారు. దేశంలోని అతిపెద్ద ఉక్కు పరిశ్రమల్లో విశాఖ ఒకటి అని, సముద్రతీరం లో ఉన్న ఏకైక ఉక్కు పరిశ్రమ అని బాబు అన్నారు. అయితే దాని భూముల విలువ ప్రస్తుతం 1.5 లక్షల కోట్ల నుండి 2 లక్షల కోట్ల వరకు ఉంటుంది అని లేఖలో పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర కి జీవనాడి వంటి ఆ పరిశ్రమ ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షల మంది కి ఉపాధి కల్పిస్తోంది అని, కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని, ప్రైవేటీకరణ కాకుండా వేరే ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించండి అంటూ చంద్రబాబు నాయుడు లేఖ లో పేర్కొన్నారు.