వైసీపీ దుర్మార్గాలకు బుద్ధి చెప్పే సమయం వచ్చింది – చంద్రబాబు నాయుడు

Sunday, January 17th, 2021, 03:00:58 AM IST

వైసీపీ దుర్మార్గాలపై ప్రజా తీర్పునకు తిరుపతి ఉప ఎన్నిక సిద్దం కావాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. తిరుపతి పార్లమెంట్ టీడీపీ నేతలతో నేడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు నాయుడు తిరుపతి ఉపఎన్నికల్లో వైసీపీనీ ఓడించి బుద్ధి చెప్పాలని, ఈ చారిత్రాత్మకమైన తీర్పుకు తిరుపతి వేదిక కావాలని అన్నారు. ఇదే స్ఫూర్తితో జనవరి 21 నుంచి 10 రోజుల పాటు, 700 గ్రామాల్లో ప్రచారం ఉధృతం చేయాలని టీడీపీ హయాంలో చిత్తూరు జిల్లాలో చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చంద్రబాబు సూచించారు.

అయితే రాష్ట్రంలో ఆలయాలపై జరుగుతున్న దాడులు సజ్జల స్క్రిప్ట్, జగన్ రెడ్డి డైరెక్షన్‌లో, డీజీపీ యాక్షన్ లో కొనసాగుతున్నాయని, రాష్ట్రవ్యాప్తంగా 150 దాడులు, ధ్వంసాలు జరిగేదాకా ఉదాసీనంగా ఉన్నారు. ఈ దాడులకు రాజకీయాలకు సంబంధం లేదు, ఉన్మాదుల పని, పిచ్చోళ్ల పనిగా భోగిరోజున డీజీపీనే చెప్పారని, ఇప్పుడు డీజీపీ మళ్లీ మాట మార్చి దీనిని ప్రతిపక్షాలకు అంటగడుతున్నారని మండిపడ్డారు. 17 మంది టీడీపీ, నలుగురు బీజేపీ నేతలను అరెస్ట్ చేశారని, దేవాలయాలపై దాడులు చేసిన వైసీపీ నేతలను కేసుల నుంచి తప్పించి, దాడులను బయటపెట్టినవాళ్లపై కేసులు పెట్టారని చంద్రబాబు ఆరోపించారు.