ఇలాగైతే పిల్లల భవిష్యత్తు ఏం కావాలి.. వైసీపీపై మండిపడ్డ చంద్రబాబు..!

Saturday, November 14th, 2020, 12:44:00 PM IST

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నేడు జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా చిన్నారులకు శుభాకాంక్షలు తెలిపారు. పెద్దలు ప్రారంభించిన పనులను కొనసాగించేది పిల్లలే అని మానవాళి భవితవ్యం వాళ్ల చేతుల్లోనే ఉందని అబ్రహాం లింకన్ అన్నారని. అంటే ప్రస్తుతం మనం మంచి పనులు చేస్తే.. రేపటి సమాజాన్ని కూడా మంచిగా ఉంచే బాధ్యతను పిల్లలు తీసుకుంటారన్నది లింకన్ ఉవాచ అని గుర్తుచేశారు. కానీ మన రాష్ట్రంలో పిల్లలు ప్రతిరోజూ వైసీపీ నేతల బూతులు వినాల్సి రావడం బాధాకరమని, తల్లిదండ్రులతో కలిసి బిడ్డల సామూహిక ఆత్మహత్యలను చూడాల్సి వస్తోందని, బాల్యంలోనే భయంకర అఘాయిత్యాలను ఎదుర్కోవాల్సి వస్తోందని ఇవన్నీ ఇలాగే కొనసాగితే రేపటి సమాజాన్ని ఊహించుకుంటేనే భయమేస్తోందని అన్నారు.

చదువు పూర్తిచేసుకుని బయటకు వచ్చిన ప్రతి విద్యార్థికీ ఉజ్వల భవిష్యత్తు ఉండేలా యూనివర్సిటీలకు, పారిశ్రామిక వేత్తలకు, కంపెనీలకు వారధిగా మన విద్యావ్యవస్థను గత ఐదేళ్ళ తెలుగుదేశం పాలనలో తీర్చిదిద్దామని కానీ ఇప్పుడు అటు విద్యావ్యవస్థను నిర్వీర్యం చేసి, ఇటు పరిశ్రమలను వాటాల కోసం బెదిరించి వెళ్ళగొట్టి యువత ఉపాధికి గండికొట్టడం విషాదకరమని, ఇలాగైతే పిల్లల భవిష్యత్తు ఏం కావాలని ప్రశ్నించారు. స్వార్థ రాజకీయాలను పక్కనబెట్టి, రేపటి పౌరుల గురించి బాధ్యతగా ఆలోచించినప్పుడే అబ్రహం లింకన్, జవహర్ లాల్ నెహ్రూ వంటి నేతలు కలలుగన్న సమాజం సిద్ధిస్తుందని చెప్పుకొచ్చారు.