న్యాయవాదుల వల్ల బెయిల్‌లు వస్తాయా.. వైసీపీపై చంద్రబాబు కామెంట్స్..!

Thursday, November 12th, 2020, 05:46:25 PM IST

వైసీపీ సర్కార్‌పై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరోసారి మండిపడ్డారు. సలాం కుటుంబానిది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని అన్నారు. కోర్టు చివాట్లు పెట్టినప్పుడైనా డీజీపీ మారి ఉంటే అబ్దుల్ సలాం కుటుంబానికి ఈరోజు ఈ పరిస్థితి ఏర్పడేది కాదని అన్నారు. రాష్ట్రంలో ఏ కుటుంబానికి భద్రత లేదని, వైసీపీ ప్రభుత్వ వైఖరి ప్రజల్లో అభద్రతను పెంచుతోందని అన్నారు. జగన్ రాక్షసత్వం, అసమర్థకు కుటుంబాలు బలైపోతున్నాయని, వేధింపులకు గురిచేసి సలాం కుటుంబాన్ని బలితీసుకున్నారని ఆరోపించారు.

అయితే సలాం కేసులో రైల్వే పోలీసులు కేసు నమోదు చేస్తే, స్థానిక పోలీసులు తెలియనట్లు నటించారని చంద్రబాబు మండిపడ్డారు. సలాం కుటుంబసభ్యులు వీడియో విడుదల చేసే వరకు వాస్తవాలు బయటకు రాలేదని అన్నారు. అయితే టీడీపీ న్యాయవాది వల్లే బెయిల్ వచ్చిందంటూ ప్రభుత్వం ఇప్పుడు కొత్త నాటకం ఆడుతోందని అసలు న్యాయవాదుల వల్ల బెయిల్‌ వస్తుందా అని ప్రశ్నించారు.